చేతిలో బీఎల్ఐ సైన్స్ డిగ్రీ.. అయినా సెక్యూరిటీ గార్డు ఉద్యోగం..

చేతిలో బీఎల్ఐ సైన్స్ డిగ్రీ.. అయినా సెక్యూరిటీ గార్డు ఉద్యోగం..

Thursday July 27, 2017,

2 min Read

కూకట్ పల్లి జేఎన్టీయూ రోడ్డు ఫేజ్ త్రీలో ఉంటుంది హైదరాబాద్ చెఫ్స్ రెస్టారెంట్. కార్ పార్కింగ్ ఏరియాలో విజిల్ వేసుకుంటూ, వచ్చిన ప్రతీ కారునీ పార్క్ చేసేందుకు సహకరిస్తుంటాడో సెక్యూరిటీ గార్డు. పైకి చూస్తే పెద్దగా చదువుకోనట్టే కనిపిస్తాడు. కానీ కదిలిస్తే తెలుస్తుంది అతని దగ్గర ఏయే డిగ్రీలున్నాయో. బీఏ పాసై, ఎస్వీ యూనివర్శిటీ నుంచి బీఎల్ఐ సైన్స్ చదవి, చివరికి సెక్యూరిటీ గార్డు అవతారం ఎత్తాడు. గుండె తరుక్కుపోయే అతని కష్టం ఏంటో అతని మాటల్లోనే చదవండి..

image


నా పేరు సూర్యపల్లి హుస్సేన్. మాది సూర్యాపేట జిల్లా చిల్కూరు మండలం కొండాపురం గ్రామం. నాకు భార్యా ముగ్గురు పిల్లలు. నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశారు. నేను 1985లో టెన్త్ పాసయ్యాను. 1989లో ఇంటర్ పూర్తయింది. 1992లో కోదాడ కేఆర్ఆర్ కాలేజీ నుంచి బీఏ(హెచ్ఈపీఎన్) పట్టా తీసుకున్నాను. ఆ తర్వాత ఎస్వీ యూనివర్శిటీ నుంచి బాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశాను. 

బస్ కండక్టర్ గా అపాయింట్మెంట్ లెటర్ ఇంటికొచ్చింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. లక్ష రూపాయలు లంచం అడిగారు. నానా కష్టాలు పడి, అక్కడా ఇక్కడా అప్పుచేసి, ఆ డబ్బుని అధికారుల చేతిలో పోశాను. రోజులు గడుస్తున్నా కొద్దీ రేపు మాపు అంటూ తిప్పించారు కానీ ఉద్యోగం మాత్రం ఇవ్వలేదు. వాళ్ల చుట్టూ చెప్పులరిగేలా తిరిగాను. లాభం లేకపోయింది. లక్ష రూపాయలు బూడిదలో పోసిన పన్నీరైంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాను.

కష్టాలు కన్నీళ్లు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ముగ్గురు పిల్లలు చదువుతున్నారు. నా మూలంగా వాళ్ల చదువు ఆగిపోవద్దు. అదే కారణంతో నేను నా భార్య హైదరాబాద్ బస్సెక్కాము. నేను ఒక హోటల్లో సెక్యూరిటీ గార్డుగా కుదిరినాను. నా భార్య వేరే హోటల్లో పాచిపనులు చేస్తోంది. మా ఇద్దరికి కలిపి నెలకు పదివేలు వస్తాయి. అందులో మాకోసం ఏమీ మిగిల్చుకోకుండా అంతా పిల్లల చదువుకు, వాళ్ల అవసరాలకే పంపిస్తుంటాం. 

మా బాధలు చూడలేక పిల్లలు వేసవి సెలవుల్లో హైదరాబాద్ వచ్చి మాకు చేదోడు వాదోడుగా ఉంటారు. వాళ్లు తలా ఒక నాలుగైదు వేలు సంపాదించి, అందులో వెయ్యి-రెండు వేలు మాకిచ్చి, మిగతావి వాళ్ల ఖర్చుల కోసం ఉంచుకుంటారు. వాళ్ల ఆనందమే మా సంతోషం. నాకేం పెద్ద ఆశల్లేవు. వాళ్ల భవిష్యత్ తీర్చి దిద్దాలనేదే మా ఇద్దరి తపన. 

ఇంత చదివి సెక్యూరిటీ గార్డేంటి అని నేను ఏనాడూ నామూషీ పడలేదు. బతికింత కాలం ఒకరి దగ్గర చేయి చాచకుండా బతకాలన్నదే నా సిద్ధాంతం. రెక్కలు ముక్కలు చేసుకుని, పస్తులుండి, కష్టపడేదంతా మా పిల్లల కోసమే. మా కష్టంలో అందులో ఆనందాన్నే వెతుక్కుంటామే తప్ప, బతుకు భారమైందనే ఆలోచన ఏనాడూ మనసులోకి రానివ్వం.